రేపే రేషన్ డీలర్లకు పరీక్ష.. పీడీఎస్ పరీక్షకు అభ్యర్థులు సమయపాలన పాటించాలి - సబ్ కలెక్టర్ వికాస్ మహతో…!




26న బోధన్ లో రేషన్ డీలర్ల నియామక పరీక్ష..


మన సమాచార్ - బోధన్


రేషన్ దుకాణాల నిర్వహణ నిమిత్తం అభ్యర్థుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష సమయంలో సమయపాలన పాటించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.


దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రానికి తరలి రావాలని, ఎవరికైనా హాల్ టికెట్ అందనిపక్షంలో పరీక్ష కేంద్రం వద్ద పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దరఖాస్తులు అంగీకరించబడ్డ అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించామని వెల్లడించారు.



180 దరఖాస్తుల అంగీకారం …

బోధన్ డివిజన్ లో 18 చోట్ల రేషన్ దుకాణాల నిర్వహణ నిమిత్తం ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వ ద్వారా నోటిఫికేషన్ విడుదలైందని సబ్ కలెక్టర్ చెప్పారు. రేషన్ దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ సమయంలో 227 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 180 దరఖాస్తులను అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. 47 దరఖాస్తు దారులు చేసుకున్న దరఖాస్తులలో వయస్సు తేడా తో పాటు నిబంధనల ప్రకారం లేని ఇతర కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ కోసం నోడల్ అధికారిగా బోధన్ తహసిల్దార్ విఠల్ ను నియమించినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారని ఆయన వివరించారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది