బంగారు భవిష్యత్తు కావాలంటే విద్యనభ్యసించాలి - జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...!

 


నిజామాబాద్, డిసెంబర్ 14 (మన  సమాచార్):

విద్యార్థులు చక్కగా చదువుకొని భవితకు బంగారు బాట వేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వర్ని మండలం కోటయ్య క్యాంప్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

         ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. గణితం, ఆంగ్లం సబ్జెక్టులు అంటే భయాన్ని విడనాడాలని, పాఠాలు అర్ధం కాకపోతే సంకోచించకుండా ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి భూమయ్య, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏ.ఓ బి.సహదేవ్, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులు రాధారాణి, కల్పన ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది