మన సమాచార్ - బోధన్
చెరువులు, నాళాలు ఆక్రమించి ఇళ్ళు, వాణిజ్య సంస్థలు నిర్మించుకున్న వారిలో కొత్త గుబులు మొదలయింది. హైడ్రాకు విచక్షణాధికారాలు కట్టబెట్టడంతో చెరువులు ఆక్రమించిన వారిలో ఆందోళన మొదలైంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పాండు చెరువు, చెక్కి చెరువులలో కట్టడాలు చేపట్టిన గృహ నిర్మాణ దారులలో ఆందోళన మొదలైంది. గొలుసు కట్టు విధానంలో నిజాం నవాబు ప్రభుత్వం నిర్మించిన ఈ చెరువులు క్రమ క్రమంగా ఆక్రమణలకు గురి అవుతున్నాయి. బోధన్ పట్టణంలో ఉండటంతో ప్రతి సంవత్సరం ఆక్రమణలు జోరు పెరుగుతున్నాయి. సుమారు 64 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువులో సుమారు 29 ఎకరాలు ఆక్రమణకు గురి అయింది. అదే విధంగా 109 ఎకరాల విస్తీర్ణం కలిగిన పాండు చెరువు సుమారు 50 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ఇరవై అయిదు వరకు గృహ నిర్మాణాలు ఈ చెరువులలో కొన సాగుతుంటాయి.
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు అందినంత దండుకొని ఇంటికి నంబర్ల కేటాయించడంతో పాటు యాజమన్యపు హక్కులు కూడా కలిపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల ఆక్రమణల పై పలువురు ఫిర్యాదులు చేసి నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమ కట్టడాల వలన ఉపాధి కొల్పోతున్నామని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం చెరువుల మరమత్తులు కోసం అమలు చేసిన పథకాలు కూడా ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేదు. హైదారాబాద్ తరహాలో పాండు చెక్కి చెరువులలో హైడ్రా అమలు చేస్తే తమ పరిస్థితి ఏమిటనేది గృహ యజమానులలో భయం చోటు చేసుకుంది. కూల్చి వేస్తే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో హైడ్రా అమలు కాక పోయినప్పటికీ భవిష్యత్ లో మాత్రం రాష్ట్రంలోని అన్ని చెరువులలో అమలు చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే పేద మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.