మన సమాచార్ - బోధన్
నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫీయా రెవెన్యూ, పోలీసులను సవాల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా అరికట్టడం అధికారులకు సవాల్ గా మారింది. జిల్లాలోని పొతంగల్ మండలంలోని సుంకిని, కొల్లూరు ప్రాంతాల నుంచి ఇసుక రవాణాపై ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. గత పదిహేను రోజుల క్రితం సీజ్ చేసిన ఇసుకను తరలించారనే కారణంతో ఓ జెసీబిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వారం క్రితం నాలుగు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. నిల్వ చేసిన మరో 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు ఇసుక రవాణాను అరికట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నా ఇసుక రవాణా దారులు ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదు. మంజీరా నుంచి పగలు ట్రాక్టర్ లతో నింపి తీసుకువచ్చి సాయంత్రం నుంచి టిప్పర్లలో నింపి రాత్రుళ్ళల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.